టయోటా అంటేనే క్లాసిక్ డిజైన్ కార్లకు ఫేమస్. ఇప్పుడు ఈ బ్రాండ్ నుంచి నియో డ్రైవ్ లుక్ తో రెండు కొత్త మోడల్స్ విడుదల అయ్యాయి. ఫార్చూనర్, లెజెండర్‌ పేరుతో వీటిని లాంచ్ చేశారు. వీటి ఫీచర్స్ తెలుసుకుందామా?

టయోటా కిర్లోస్కర్ మోటార్(TKM) కొత్త నియో డ్రైవ్ అవతారంలో ఫార్చూనర్, లెజెండర్‌ అనే రెండు మోడల్స్ ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. 

ఫార్చూనర్, లెజెండర్‌ ఫీచర్లు ఇవే..

ఇవి మెరుగైన 48-వోల్ట్ సిస్టమ్‌తో వస్తాయి. ఈ రెండు కొత్త నియో డ్రైవ్ వేరియంట్లు మెరుగైన ఇంధన సామర్థ్యం, డ్రైవింగ్ పనితీరు, మెరుగైన అనుభూతిని ఇస్తాయని కంపెనీ చెబుతోంది. టయోటా ఫార్చూనర్, లెజెండర్ నియో డ్రైవ్ 2.8 లీటర్, 4-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్‌తో 48-వోల్ట్ సిస్టమ్‌తో వస్తాయి.

బ్యాటరీ, హైబ్రిడ్ క్వాలిటీస్ అద్భుతం

ఇందులో బెల్ట్-ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్, లిథియం-అయాన్ బ్యాటరీ ఉన్నాయి. ఈ హైబ్రిడ్ అసిస్ట్ స్మూత్ యాక్సలరేషన్, సైలెన్స్ ఆపరేషన్, మెరుగైన పనితీరును అందిస్తుందని టయోటా బ్రాండ్ చెబుతోంది.

ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌ ఎలా ఉన్నాయంటే..

ఫార్చూనర్, లెజెండర్ రెండూ వాటి డిజైన్, పనితీరు, ఫీచర్లతో అంచనాలకు తగ్గట్టుగా ఉన్నాయి. ఫార్చూనర్, లెజెండర్ నియో డ్రైవ్ ఇప్పటికే ఉన్న వాటిలాగే ఎక్స్‌టీరియర్‌ని కలిగి ఉన్నాయి. టయోటా లెజెండర్ కారులో డ్యూయల్-టోన్ బాడీ కలర్స్, స్ప్లిట్ LED హెడ్‌ల్యాంప్స్, స్టైలిష్ ఫేసియా ఉన్నాయి. 

సేఫ్టీ సిస్టమ్ వేరే లెవల్ అంతే..

రెండు మోడళ్లలోనూ డ్యూయల్-టోన్ లెదర్ అప్హోల్స్టరీ, సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, సౌకర్యవంతమైన సీట్లు ఉన్నాయి. టయోటా ఫార్చూనర్, లెజెండర్‌లలో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, బ్రేక్ అసిస్ట్‌తో వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, WIL కాన్సెప్ట్ సీట్లు, హిల్ అసిస్ట్ కంట్రోల్ ఉన్నాయి.

TRC (ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్), చైల్డ్ రెస్ట్రెయింట్ సిస్టమ్, ప్రీ-టెన్షనర్ + ఫోర్స్ లిమిటర్‌తో ఫ్రంట్ రో సీట్ బెల్ట్‌లు, ఎమర్జెన్సీ అన్‌లాక్‌తో స్పీడ్ ఆటో లాక్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 

రెండు కార్ల ధరలు ఎలా ఉన్నాయంటే..

టయోటా ఫార్చూనర్ నియో డ్రైవ్ 48V ధర రూ.44.72 లక్షలు (ఎక్స్-షోరూమ్), లెజెండర్ నియో డ్రైవ్ 48V ధర రూ.50.09 లక్షలు (ఎక్స్-షోరూమ్).